ఒక యువకుడు కాలేజీలో లవర్‌ని కలిసేందుకు ఏం చేసాడో తెలుసా..

84

    ఖమ్మంలో ఓక కాలేజీలో ఓ యువకుడు (Fake Raw Officer) హల్ చల్ చేశాడు. ప్రిన్స్ పాల్, సిబ్బందిని ఫేక్ ఐడితో బెదిరించాడు. ఆ కాలేజీలో చదువుతున్న ప్రియురాలితో మాట్లాడేందుకు వీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రచ్చ రచ్చ చేశాడు. చివరకు యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించడంతో కధ సుఖాంమైంది.

    ఖమ్మం జిల్లాలో కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిని కలిసేందుకు ఖమ్మంకు చెందిన ఉదయ్ కిరణ్ అనే యువకుడు నానా హంగామా చేశాడు. హైదరాబాద్ లో సిఎ చదువుతున్న ఆ యువకుడు తన ప్రేమించిన అమ్మాయిని కలిసేందుకు ఓ ప్లాన్ అమలు చెయ్యాలనుకున్నాడు. అందుకోసం రా సంస్థకు చెందిన ఆఫీసర్ గా నకిలీ ఐడెంటి కార్డును తయారు చేసుకున్నాడు. దాంతో కార్డు చూపించి కాలేజీలో ప్రవేశించిన యువకుడు ప్రిన్సిపల్ ని కలిశాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయిని బయటికి పంపించాలని కోరాడు. కాని ప్రిన్సిపల్ పర్మిషన్ ఇవ్వకపోవటంతో నకిలీ ఐడీ కార్డు చూపించి వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.

    వెంటనే అప్రమత్తమైన సిబ్బంది యువకుడి ఐడీ కార్డు (Fake Raw Officer) పై విచారణ చేపట్టగా అది నకిలీ ఐడి కార్డుగా తేలింది. సిబ్బంది ప్రశ్నలకు యువకుడు తడబడుతూ సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తను ప్రేమించిన యువతిని కలిసేందుకే నకిలీ రా ఆఫీసర్ గా వచ్చినట్లుగా ఒప్పుకున్నాడు. అతడిపై చీటింగ్ కేసు నమోదు చేసి, నకిలీ ఐడీ కార్డులు తయారు చేస్తున్నవారిపై కూడా కేసులు నమోదు చేశారు.