మీడియాకు చేతులెత్తి దండం పెట్టిన మారుతీరావు భార్య

156
   మిర్యాలగూడలోని మారుతీరావు (Maruti Rao Death)నివాసంలో ఆయన మృతదేహం చుట్టూ చేరిన మీడియాకు మారుతీరావు బార్య  దండంపెట్టి వేడుకున్నారు. భర్త మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమె మీడియాపై కొంచెం అసహనం వ్యక్తం చేశారు. సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీ రావు శనివారం (మార్చి 7) అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యా భవన్‌లో రూమ్ అద్దెకు తీసుకొని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆర్యవైశ్య భవన్‌లో క్లూస్‌ టీంతో తనిఖీలు చేయించారు. భవనంలోని ఓ గదిలో మారుతీ రావు మంచంపై విగతజీవిగా పడి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యా, సహజ మరణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి, చివరకు ఆత్మహత్యగా నిర్ధారించారు.
    ప్రణయ్‌ హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, కేసుల ఒత్తిడి కారణంగానే మారుతీ రావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఘటన జరిగిన స్థలంలో పోలీసులు ఓ లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ‘గిరిజా క్షమించు, అమృతా అమ్మదగ్గరికి రా’ అని రాసి ఉందట. మారుతీ రావు మృతదేహానికి (Maruti Rao Death) ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అక్కడ నుంచి ఆ మృతదేహాన్ని కుటుంబసభ్యులు నేరుగా మిర్యాలగూడలోని నివాసానికి తరలించారు. మారుతీరావు మరణవార్త విన్న ఆయన భార్య గిరిజ బోరున విలపించారు. మారుతీరావు సోదరుడు శ్రవణ్.. గిరిజను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. మృతదేహాన్ని చూడగానే.. చేతులతో బాదుకుంటూ ఆమె గుండెలవిసేలా రోదించారు.