కలబంద ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారా.. కొంచెం జాగ్రత్తగా ఉండండి..

70
Be Careful with Aloe Vera
Be Careful with Aloe Vera

కడుపులో సమస్యా?  కలబంద జ్యూస్​ తాగండి! ఏవైనా చర్మ సమస్యలా? కలబంద గుజ్జు వాడండి! షుగర్​ ఉందా? రోజు కలబంద స్లైస్​ను నోట్లో వేసుకోండి! అందం పెంచుకోవాలా? ఉందిగా కలబందా! ఆరోగ్యంగా ఉండాలా? కలబంద దివ్యౌషధం! ఒక్కమాటలో చెప్పాలంటే.. సర్వవ్యాధి నివారిణి కలబంద! ఇట్ల… అడక్కుండానే ఉచితంగా సలహాలిచ్చేవారు ఎందరో!! దేవుడిచ్చిన వరం ఈ కలబంద .. అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు!! అయితే ఈ మాటలు చెప్పేవాళ్లందరికీ కలబంద గురించి తెలిసింది సగమే అని చెప్పాలి. ఎందుకంటే.. కలబంద వల్ల ఎన్ని లాభాలున్నాయో.. అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. వాడకపోతే లాభం కలగదేమో.. కానీ పద్ధతిగా వాడకపోతే నష్టం మాత్రం తప్పదు.

గుజ్జు​..

కలబందలో రెండు రకాల పదార్థాలుంటాయి. ఒకటి ట్రాన్స్​పరెంట్​గా కనిపించే గుజ్జు. రెండోది పసుపు రంగులో కనిపించే లేటెక్స్. గుజ్జులో 96 శాతం నీరు, A, B, C, E విటమిన్లు ఉంటాయి.  చాలామంది గుజ్జును షుగర్​, హెపటైటిస్, బరువు తగ్గడానికి, జీర్ణకోశ వ్యాధులు, కడుపులో అల్సర్లు, ఆస్టియో ఆర్థరైటిస్, ఉబ్బసం, జ్వరం, దురద, వాపు వంటివి తగ్గించుకునేందుకు వాడతారు. స్కిన్​కేర్​గా, హెయిర్​కేర్​గా కూడా ఉపయోగిస్తారు. గుజ్జుతో తయారుచేసిన జ్యూస్​ను ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడతారు.

లేటెక్స్ సైడ్​ఎఫెక్ట్స్​…

కలబంద లేటెక్స్ పసుపు రంగులో ఉంటుంది. ఆకు  పైపొర కింద నుంచి తీస్తారు. తక్కువ మోతాదులోనైనా లేటెక్స్​ను తాగడం మంచిదికాదు. దీనివల్ల కిడ్నీ సమస్యలు, కడుపునొప్పి, పొటాషియం లెవెల్స్​  పడిపోవడం వంటి సైడ్​ఎఫెక్ట్స్​ కలుగుతాయి. ఇవే కాకుండా మరెన్నో సైడ్​ఎఫెక్ట్స్​ ఉన్నాయి.

అలర్జీ..

అదేపనిగా రోజూ కలబంద గుజ్జు వాడితే స్కిన్​ అలర్జీ,  వాపు, దద్దుర్లు , కనురెప్పలు ఎర్రబడడం, చర్మం పొడిబారడం, గట్టిపడటం, ఊదా రంగు మచ్చలు ఏర్పడటం, చర్మం పగలడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

షుగర్​ లెవెల్స్​ పడిపోతాయి..

అలోవెరా రక్తంలో షుగర్​ లెవెల్స్​ ను ఒక్కసారిగా తగ్గించేస్తుంది. అందుకే షుగర్​ ఉన్నవారు కలబందను జాగ్రత్తగా వాడాలి. షుగర్​ లెవెల్స్​ ఒక్కసారిగా పడిపోతే ప్రాణాపాయం ఉంది.

లివర్​ సమస్యలు..

కలబంద జ్యూస్​ అతిగా తాగితే లివర్​ ఇన్​ఫ్లమేషన్​కు దారితీస్తుంది. కారణం.. అలోవెరాలో ఉండే  సి-గ్లైకోసైడ్స్, యాంత్రక్వినోన్స్, యాంత్రోన్స్, లెక్టిన్స్, పోలిమన్నన్స్, ఎసిటైలేటెడ్ మన్నన్స్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు కాలేయం పనితీరుని దెబ్బతిస్తాయి.

కిడ్నీ సమస్యలు..

సాధారణంగా మనం వాడే పెయిన్​ కిల్లర్స్, జ్వరం తగ్గడానికి వాడే యాంటిబయాటిక్స్​తో కలబంద కలిసి కొన్నిరకాల సైడ్​ఎఫెక్ట్స్​కు కారణమవుతుంది. కలబందలో ఉండే లేటెక్స్​ కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది.

ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్​..

అధిక మొత్తంలో కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల విరేచనాలు, అతిసారం మరియు తీవ్రమైన కడుపు నొప్పి కలిగి , ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్​కు దారితీస్తుంది.

కడుపులో ఇబ్బంది..

కలబంద రసం తాగడం వల్ల కడుపులో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడేవారు కలబందకు దూరంగా ఉండడం లేదా మితంగా వాడడం మంచిది. కొన్నిరకాల పేగు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు కలబంద కారణంగా మరింత ఇబ్బంది పడతారు.

హెమరాయిడ్స్​ ఉంటే జాగ్రత్త..

కడుపులో హెమరాయిడ్స్​ ఉన్నవారు కలబంద జోలికే వెళ్లొద్దు. ఆపరేషన్​ చేసే సమయంలో, చేసిన తర్వాత షుగర్​ లెవెల్స్​ పడిపోవడానికి, పెరగడానికి కలబంద కారణమవుతుంది. అందుకే ఆపరేషన్లకు రెండువారాల ముందే కలబంద వాడడం మానేయాలి.

హార్ట్​ పేషెంట్స్​.. బీ కేర్​ఫుల్​..

కలబంద రసం తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను అధికం చేసే ‘అడ్రినలిన్’ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పొటాషియం లెవెల్స్​ తగ్గడంతో హార్ట్​బీట్​ దెబ్బతింటుంది.

మలబద్దకం..

ఎక్కువ కాలంపాటు కలబంద రసం తీసుకో వటం వల్ల మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉన్నవారు మితంగా కలబంద వాడితే లాభమే. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం నిపుణుల సలహా మేరకే వాడాలి.

నిజానికి అలోవెరాలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే దానిని వాడే పద్ధతి, ఎంత మోతాదులో  తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. పేపర్లలో, టీవీల్లో, నెట్​లో చూసి వాడేస్తుంటారు. ఫలితంగా అనేకరకాల సైడ్​ఎఫెక్ట్స్​ను ఫేస్​ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు. అందుకే నిపుణుల సలహా మేరకు వాడడం మంచిది. అయితే చాలారకాల అనారోగ్య సమస్యలకు అలోవేరా మందుగా పనిచేస్తుందని చెబుతారు. నిజానికి చాలావరకు సైంటిఫిక్​గా ప్రూవ్​ కాలేదు. అయితే అన్నింటికీ ఒకటే మందు అన్న రీతిలో అలోవెరాను వాడొద్దు. A,B,C,E విటమిన్లు ఉన్నందున సంబంధిత విటమిన్​ లోపాన్ని తగ్గించుకునేందుకు వాడొచ్చు. అంతేకానీ ఏ సమస్య వచ్చినా అలోవెరా వాడడమే పరిష్కారం కాదు. ‌‌‌‌

 – డాక్టర్​ ఉదయ్​ కిరణ్​, ఫిజీషియన్​, మోతీనగర్​, హైదరాబాద్​

సైడ్ఎ ఫెక్స్ట్ ..
అతిసారం, పొత్తికడుపులో నొప్పి, కండరాల బలహీనత, గొంతులో వాపు వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. కొన్నిసార్లు చూపు కోల్పోవడం కూడా జరగొచ్చట. అంతేకాదు కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది.