హైదరాబాద్‌కు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్? ఎక్కడి నుంచి ఎక్కడికంటే..

113

   అతిత్వరలో సికింద్రాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. ఒకవైపు మనదేశంలో ఇప్పటికే తొలి బుల్లెట్ ట్రైన్ (Bullet train) ప్రాజెక్ట్ (ముంబై-అహ్మదాబాద్) పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో భారత రైల్వే మరిన్ని ఎక్కువ బుల్లెట్ ట్రైన్లను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తుంది. మరో ఆరు బుల్లెట్ ట్రైన్స్ నడపాలని ప్రణాళికలు కూడా రూపొందిస్తోన్నట్లు సమాచారం. ఇండియన్ రైల్వేస్ తన నెట్‌వర్క్‌లో ప్యాసింజర్, సరుకు రవాణా ట్రైన్స్ స్పీడ్‌ను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుత ట్రైన్ల స్పీడ్‌ను పెంచడంతోపాటు మరోవైపు దేశంలో మరిన్ని హైస్పీడ్ కారిడార్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రెడీ చేస్తోంది.

   రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ లోక్ సభలో ఇచ్చిన లిఖిత పూర్వఖ సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్ట్ లో రెండు ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా న్యూఢిల్లీ-హౌరా, న్యూఢిల్లీ-ముంబై రూట్లలో ట్రైన్ స్పీడ్‌ను గంటకు 160 కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు దేశంలో మరో ఆరు హైస్పీడ్ రైల్ కారిడార్స్‌ను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోందని జాతీయ మీడియా పేర్కొంటోంది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకారం.. దీనికి సంబంధించిన పనులను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ ఆరు బుల్లెట్ ట్రైన్ (Bullet train) మార్గాలు ఏంటంటే 1. ఢిల్లీ- నోయిడా- ఆగ్రా- కాన్పూర్- లక్నో- వారణాసి కారిడార్ (865 కిలోమీటర్లు), 2. ఢిల్లీ- జైపూర్- ఉదయ్‌పూర్- అహ్మదాబాద్ కారిడార్ (886 కిలోమీటర్లు), 3. ముంబై- నాసిక్- నాగ్‌పూర్ కారిడార్ (753 కిలోమీటర్లు), 4. ముంబై- పూణే- హైదరాబాద్ కారిడార్ (711 కిలోమీటర్లు), 5. చెన్నై- బెంగళూరు- మైసూర్ కారిడార్ (435 కిలోమీటర్లు), 6. ఢిల్లీ- చండీగఢ్- లుధియానా- జలంధర్- అమృత్‌సర్ కారిడార్ (459 కిలోమీటర్లు). కేంద్ర ప్రభుత్వం మొత్తం 10 బుల్లెట్ ట్రైన్స్‌ను దేశంలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రైల్వేస్ కూడా మెగా విస్తరణ ప్రణాళికను రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే ఈ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం కోసం పంపించినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. కేంద్రం ఈ ప్రదిపాదనలపై సమగ్ర నివేదిక కోరినట్లు తెలుస్తోంది.